Friday, October 1, 2010

మహాజనం చెక్కిన సజీవశిల్పం వైఎస్ * సంస్మరణ

వైఎస్‌పై నేడు బురద జల్లుతున్న వారిలో అత్యధికులు కాంగ్రెస్‌లోని ఒకనాటి ప్రత్యర్థులే. తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ అధిష్టానం పేరు చెబుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు వైఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైఎస్‌ను రక్షణ కవచంలా కాపాడి వెన్నంటి నడిచిన ప్రజలు వెఎస్ పథకాలను, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కావలసిందల్లా వారి ఆకాంక్షలకు, ఆశయాలకు అద్దంపడుతూ వైఎస్ పథకాలను చిత్తశుద్ధితో అమలుచేసే నాయకత్వం ముందుకు రావడమే.

ప్రజలు చరిత్ర నిర్మాతలు. వారు చరిత్రను ప్రభావితం చేసే నాయకులను సృష్టించుకుంటారు. ధీరోదాత్త నాయకులను పసిగట్టి రక్షించుకోగల శక్తి వారికి స్వాభావికం. వైఎస్ ఒక అపురూపమైన నాయకుడు. ఆయన వ్యవహార శైలి అద్వితీయం. ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోవడం, వారి ఆకాంక్షలను గౌరవించడం, అర్థం చేసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీ నేతలలో ఈ గుణం అతి అరుదు. వైఎస్ ఒక ప్రతిభావంతుడైన నాయకుడు కావడం వలన ఆయనకు బలమైన రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపక్షంలోనేకాక సొంత పార్టీలోనూ నిరంతరం వెంటాడారు.

రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లా నేపథ్యంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకులు కాంగ్రెస్‌లోనూ, తెలుగుదేశంలోనూ మనకు తారసపడతారు. వీరిని రాజకీయంగా జయించడానికి ఆయన అనుసరించిన విధానాలు విశిష్టమైనవి. విశ్వసనీయత పెంచుకోవడం, పరిస్థితులకు తగినట్టు స్పందించడం, ప్రజా ప్రయోజనాల కోసం స్వపర భేదాలు లేకుండా ప్రధాన పక్షాలతో విభేదించడం, పోరాడటం ఆయనలో ప్రత్యేక లక్షణం. నిరంతరం శ్రమించడం, ప్రజలతో, కార్యకర్తలతో, తన మద్దతుదారులతో సజీవ సంబంధాలు కలిగి ఉండటం, వారి అవసరాలకు స్పందించడం రోజువారి కార్యక్రమం. ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, నిరంతర అధ్యయనం ఆయనను బలీయమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి.

ఆయన అనర్గళమైన ఉపన్యాసకుడు కాదు. పెద్ద ఆర్థికవేత్త అంతకంటే కాదు. ఒక మారుమూల నియోజకవర్గం నుంచి అంచెలంచెలుగా ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ఎదిగివచ్చిన నేత. కఠోరమైన దీక్ష, పట్టుదల, ఎన్ని అపవాదులు, అపనిందలు, అవహేళనలు, నీలాపనిందలు ఎదురైనప్పటికీ ప్రజల ఆశీస్సులతో, మద్దతుతో వాటిని అధిగమించిన ధీశాలి. ప్రజల ఆశీస్సులు ఆయనకు శ్రీరామరక్షగా నిలిచాయి.


సంప్రదాయ కాంగ్రెస్ వ్యవహారశైలికి భిన్నంగా వైఎస్ ప్రజలను సమీకరించారు, చైతన్యపరచారు, ఆందోళనలు చేపట్టారు. ఒక ప్రాంతీయ పార్టీ (తెలుగుదేశం) రాష్ట్రంలో తమిళనాడు, బెంగాల్, యూపీ, బీహార్ రాష్ట్రాలలో వలే వేళ్లూనుకొని పోయిందన్న భావనను పెకలించిన బలశాలి వైఎస్. ఆయన ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాల్పడిన అనేక ప్రజావ్యతిరేక విధానాలు, గ్రూపు తగాదాలను, అవినీతి అక్రమాలను ప్రాంతీయ తెలుగుదేశం విమర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన జరిపిన రాజకీయ పోరాటం విలక్షణమైనది.

ఆయన రాయలసీమ ఉద్యమంలో లేపాక్షి-పోతిరెడ్డిపాడు పాదయాత్ర, విద్యుత్ ఉద్యమంలో 18 రోజుల నిరాహార దీక్ష, సీమ సమస్యలపై 13 రోజుల నిరాహార దీక్ష, చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురానికి 1,600 కిలోమీటర్ల పాదయాత్ర, సద్భావనయాత్రలు, కాంగ్రెస్ శ్రేణులను ఐక్యపరుస్తూ జరిపిన బస్సు రథయాత్రలు, కార్యకర్తలకు, ప్రజలకు, రైతులకు కష్టాలు ఎదురైనప్పుడు వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి నిరంతరం ప్రజల వద్దకు వెళ్లారు. ప్రజలలో విశ్వాసం కల్పించి మరో ఇందిరమ్మ పాలన రాబోతున్నదని, ప్రజలు ఆశావహ వాతావరణంలో జీవించాలని, ఆత్మహత్యలు మానుకోవాలని, పోరాటాలకు సిద్ధం కావాలని చేసిన దీక్షలు, పోరాటాలు అసామాన్యమైనవి. రాజకీయ రంగ నిపుణులు లోతుగా విశ్లేషించదగినవి.

వైఎస్‌ను ప్రజలు నమ్మారు. ఆయన కష్టాలలో భాగస్వాములు అయ్యారు. రాయలసీమ ఉద్యమాన్ని కాంగ్రెస్ అధిష్టానం, ప్రత్యేకించి ఆనాటి పీసీసీ అధ్యక్షులు జలగం వెంగళరావు గుర్తించలేదు. పైగా ఉద్యమంతో సంబంధంలేదని బాహాటంగా ప్రకటించారు. అలాగే చేవెళ్ల- ఇచ్ఛాపురం పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌పార్టీలోని బలమైన నాయకత్వం ఒక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఆయన అనుచరులు పాదయాత్ర పవిత్రతను ప్రశ్నిస్తూ తెలుగుదేశం నాయకులు కూడా చేయని విమర్శలు చేశారు. కోట్లు ఖర్చుపెడుతూ, ఏసీ రూముల్లో గడుపుతూ జరుగుతున్న పాదయాత్రగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పాదయాత్రలో రాజమండ్రిలో మజిలీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నాటి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్ ముఖ్యఅతిథిగా రావడానికి నిరాకరించారు. కానీ ప్రజలు బాధ్యతగా, ఆప్యాయతతో, అభిమానంతో వైఎస్‌ను దీవించారు. ఆయన వెంట నడిచారు.

ఒక సందర్భంలో వైఎస్‌కు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని 18 మంది ఎంపీలు సంతకాలు చేసి నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు విజ్ఞప్తిని సమర్పించారు. 78 మంది శాసన సభ్యులు పులివెందుల అసెంబ్లీ నుంచి ఎన్నిక కావడానికి ఆయన అభ్యర్థిత్వం అంగీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధిష్టానం అంగీకరించలేదు. అనంతపురంలో సద్భావనయాత్ర ఏర్పాటు చేస్తే ఆ నాటి కేంద్ర మంత్రి రాజేష్ పైలట్‌ను సభకు రానివ్వకుండా అధిష్టానం అడ్డుపడేటట్లు కొందరు నాయకులు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ వైఎస్ రాజకీయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వచ్చి చంద్రబాబునాయుడు పాలనను కొనియాడుతూ పొగడ్తలు కురిపించారు. ఎంతో హుందాగా ఈ పరిణామాలను వైఎస్ స్వీకరించారు. తనదైన పరిధిలో ప్రజలకు చేరువగా ఉంటూ పోరాటాలు చేశారు.

1989-90 ఎన్నికల్లో స్వర్గీయ రాజీవ్‌గాంధీ వైఎస్‌ను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భారాన్ని స్వీకరించవలసిందిగా కోరాడు. వైఎస్ యువకుడిగా ఏ పదవులు లేకుండా తెలుగుదేశాన్ని మట్టికరిపించే క్రమంలో క్రియాశీలక శక్తిగా ఎదిగాడు. వైఎస్ సభలకు ప్రజలు విశేషంగా తరలివచ్చారు. ఇష్టపూర్తిగా ఆశీర్వదించారు. 1989-94 మధ్య అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో పూర్తిగా విఫలమయింది. కాంగ్రెస్ శ్రేణులను, సానుభూతిపరులను, కార్యకర్తలను చివరకు శాసనసభ్యులను సైతం నిర్లక్ష్యం చేశారు. ఈ సంక్షుభిత సందర్భంలోనే రాజశేఖరరెడ్డిలోని ప్రజానాయకుడు వెలికి వచ్చాడు. ఆనాటి ముఖ్యమంత్రుల ప్రజావ్యతిరేక విధానాలను, మంత్రుల బాధ్యతారాహిత్యాన్ని ఎండగడుతూ నిజమైన జనహిత నేతగా ప్రజల ముందు నిలిచారు. ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే, తన సొంత పార్టీలోని నాయకులను సైతం వైఎస్ ధిక్కరించగలడని, వారితో పోరాడగలడని ఒక శక్తివంతమైన సంకేతాన్ని ఆయన ప్రజలకు అందచేశారు.

కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ అనేక అవమానాలను, అడ్డంకులను, నిందలను భరించాడు. ఆయన బెరైటీస్ గనుల లీజు కాంగ్రెస్ హయాంలోనే రద్దు కావడం గమనార్హం. ఆయన తండ్రిని కాంగ్రెస్‌లోని తన ప్రత్యర్థులు, తెలుగుదేశంలోని తన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి హత్య చేయించారు. ఇటువంటి అనేక చర్యలు ఆయనను తన రాజకీయ పోరాటం నుంచి మళ్లించడానికి, అతనిని మానసికంగా లోబర్చుకోవడానికి స్థానిక ఫ్యాక్షన్ రాజకీయాలలో చేరిపోవడానికి జరిగిన చర్యలుగా భావించి వైఎస్ రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసేందుకు నడుం బిగించారు. కడప, ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలో ఆయన అనుచరులు ప్రత్యర్థులపై చర్యలు తీసుకోకుండా నివారించడాన్ని అవతలి పక్షం జీర్ణం చేసుకోలేకపోయింది. అయినా ఆయన తన ధ్యేయాన్ని మార్చుకోలేదు. వైఎస్ 1989లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించడంలోనే కాదు, 1999లో కూడా కాంగ్రెస్‌ను దరిదాపుగా విజయానికి చేర్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి.

రాజీవ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. నాయకత్వ లోటు స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో వైఎస్ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూవచ్చారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర అనేక రాష్ట్రాల్లో సోనియా అండదండలు కలిగిన నాయకులు సాధించలేని విజయాలను వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చేసి చూపెట్టారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల విధేయుడుగా తాను చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వారి పేర్లు పెట్టారు. బలమైన ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవాలంటే రాష్ట్రాల్లో బలమైన ప్రజాపునాది కలిగిన నాయకులు స్థానికంగా ఎదగాలని వైఎస్ తరచూ ఏఐసీసీ సమావేశాల్లో ప్రస్తావించేవారు. జిల్లా కమిటీలకు, రాష్ట్ర కమిటీలకు స్వయం నిర్ణయాధికారం కావాలని, పార్టీలో వికేంద్రీకరణ జరగాలని కోరుతూనే బలమైన కేంద్రీకృత ప్రజాస్వామిక వ్యవస్థను ఆయన కోరుకునేవారు.

వైఎస్, ఏ రాష్ట్రంలో, ఏ రాజకీయ పార్టీ అమలు చేయని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. పదేళ్ల తెలుగుదేశం పాలనలో రాష్ట్రం ఎంతగా నాశనమైందో తెలిసిందే. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్యసంస్థ, బహుళజాతి కంపెనీల దయాదాక్షిణ్యాలకు భారత ఆర్థిక వ్యవస్థ దాసోహమంటూ మార్కెట్ ఆర్థిక వ్యవస్థే అన్నిటినీ పరిష్కరించగలదని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదనే బలమైన వాదనలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు సాహసోపేతమైనవి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకమైనవి. వైఎస్ అకాల మరణంతో భారతదేశం వేగుచుక్కను కోల్పోయింది. ఆయన మరణంతో అందరూ తల్లడిల్లిపోయారు. వైఎస్ మరణించిన ఒక సంవత్సరంలో ఏ రోజూ వైఎస్ ఉనికిని గుర్తించుకోలేని రోజంటూ లేకుండా పోయింది. వైఎస్ వారసత్వాన్ని నిలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమయింది. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ లయ తప్పింది. నేడు ప్రతిపక్ష తెలుగుదేశం, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలు వైఎస్‌పై పనిగట్టుకుని కువిమర్శలు చేస్తున్నాయి. బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయి.

వైఎస్‌పై నేడు బురద జల్లుతున్న వారిలో అత్యధికులు కాంగ్రెస్‌లోని ఒకనాటి ప్రత్యర్థులే. తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తోడుగా అధిష్టానం పేరుచెబుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు వైఎస్‌ై జలయజ్ఞంపై, సంక్షేమ కార్యక్రమాలపై నిందాపూర్వకమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైఎస్‌కు తోడు నీడగా ఉంటూ రక్షణ కవచంలా కాపాడి వెన్నంటి నడిచిన ప్రజలు వెఎస్ పథకాలను, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కావలసిందల్లా వారి ఆకాంక్షలకు, ఆశయాలకు అద్దంపడుతూ వైఎస్ పథకాలను చిత్తశుద్ధితో అమలుచేసే నాయకత్వం ముందుకు రావడమే.
ఇమామ్ , సంపాదకులు, ‘కదలిక’

No comments:

Post a Comment