Thursday, July 8, 2010

అసెంబ్లీలో 'వైఎస్'


ఇన్నర్ లాబీలో 9 అడుగుల నిలువెత్తు చిత్రపటం

గాంధీ, అంబేద్కర్ పటాల ఎత్తు మూడు అడుగులే
ఎవరిని అడిగి పెట్టారని టీడీపీ ప్రశ్న
సభా సంప్రదాయాలను మంటగలిపారని ధ్వజం
స్పీకర్‌ది ఏకపక్ష నిర్ణయమని అభ్యంతరం
బిజినెస్ పర్పస్ కమిటీలో చర్చింకపోవడంపై ఆగ్రహం
ఇది గాంధీ భవన్ అనుకున్నారా: చంద్రబాబు పీవీ, నీలం, ఎన్టీఆర్ పటాలు లేవే: ముద్దు కృష్ణమ
నిబంధనల ప్రకారమే పెట్టాం: స్పీకర్

అసెంబ్లీకి 'వైఎస్' చిత్ర కళ వచ్చింది. శాసనసభ ఇన్నర్ లాబీలో వైఎస్ తొమ్మిది అడుగుల నిలువెత్తు చిత్రపటాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దివంగత నేత జయంతి సందర్భంగా గురువారం ఈ చిత్రాన్ని స్పీకర్ కిరణ్ కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అయితే... ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా, బిజినెస్ పర్పస్ కమిటీలో చర్చించకుండా ఫొటోను పెట్టడం, ఇప్పటికే ఉన్న మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ స్పీకర్ల ఫొటోలకంటే ఇది పెద్ద సైజులో ఉండటం వివాదాస్పదమైంది.

దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆక్షేపించింది. శాసనసభలోనూ ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావించింది. ఇది అసెంబ్లీనా కాంగ్రెస్ జాగీరా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క వచ్చి చంద్రబాబును ఆహ్వానించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, ఆ తర్వాత రమ్మంటే తాము రాలేమని చంద్రబాబు స్పష్టం చేశారు.


అన్నిటికీ తల ఊపలేం: బాబు
"ఇది అసెంబ్లీనా, కాంగ్రెస్ పార్టీ జాగీరా? గాంధీ భవన్ అనుకుంటున్నారా? అసెంబ్లీకి ఉన్న పవిత్రతను కూడా దిగజార్చి రాజకీయ బురదపూస్తున్నారు'' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. "వైఎస్ హయాంలో చోటు చేసుకొన్న అవినీతి, అరాచకం, దోపిడీలపై ఆరేళ్ళు పోరాడాం. ఆయన అనుకోకుండా మరణించినప్పుడు హూందాగా వ్యవహరించాం. ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చాం.

అంతమాత్రాన ప్రతిదానికీ తలూపలేం. సభా సంప్రదాయాలు, నిబంధనలను తుంగలో తొక్కుతుంటే అభ్యంతరం చెప్పకుండా ఉండలేం'' అని స్పష్టం చేశారు. "పీవీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశానికి ప్రధాన మంత్రి అయిన తొలి తెలుగు వ్యక్తి. ఆయన చిత్రపటం ఇంతవరకూ అసెంబ్లీలో పెట్టలేదు. నీలం సంజీవరెడ్డి నిజాయితీకి పెట్టింది పేరు. ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా చేసినా ఆయన ఫొటో పెట్టలేదు. ఎన్టీఆర్, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానేతల చిత్రాలెవరివీ లేవు.

ఇప్పటిదాకా స్పీకర్లుగా పని చేసిన వారి ఫొటోలు పెట్టడం అనవాయితీగా వస్తోంది. ఇతరులవి పెట్టాలంటే... శాసనసభ బిజినెస్ పర్పస్ కమిటీలో చర్చించాలి. లేదా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించవచ్చు. ఏదీ లేకుండా ఇష్టానుసారం స్పీకర్ ఎలా నిర్ణయాలు తీసుకొంటారు?'' అని చంద్రబాబు నిలదీశారు. ఇంత తొందరపాటు ఎందుకని ప్రశ్నించారు. గురువారం ఉదయం అప్పటికప్పుడు సమాచారం ఇచ్చి రమ్మన్నారని... స్పీకర్ అనుసరించాల్సిన పద్ధతి ఇదేనా అని అడిగారు. ముఖ్యమంత్రి రోశయ్య ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకొన్నారేమో అన్నప్పుడు... ఆయన ఒత్తిడి సభలో కూడా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.

అంతా మీ ఇష్టమా: గాలి
శాసనసభలోనూ ఈ అంశాన్ని టీడీపీ ప్రస్తావించింది. జీరో అవర్‌లో గాలి ముద్దు కృష్ణమ దీనిపై మాట్లాడారు. "శాసనసభకు కొన్ని నియమ నిబంధనలను, సాంప్రదాయాలు ఉన్నాయి. సభ ఏ పార్టీ సొత్తూ కాదు. శాసనసభ ఆవరణలో విగ్రహం పెట్టాలన్నా, ఫొటో పెట్టాలన్నా జనరల్ పర్పస్ కమిటీని ఏర్పాటు చేసి, దాని ఆమోదం తీసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15మంది సీఎంలు పని చేశారు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా, పీవీ ప్రధానిగా చేశారు.

ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పారు. బ్రహ్మానంద రెడ్డి, టి. అంజయ్య వంటి ప్రముఖుల ఫొటోలు పెట్టకుండా ఒక్క వైఎస్ ఫొటోనే ఎందుకు పెడుతున్నారు? సీఎంగా ఉండి చనిపోయినంత మాత్రాన ఏ ప్రత్యేకత రాదు. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు అంబేద్కర్, అల్లూరి సీతారామరాజుల ఫొటోలు పెట్టడం కోసం అప్పటి స్పీకర్లు జనరల్ పర్పస్ కమిటీలను నియమించారు.

ఆ కమిటీలు ఆమోదించిన తర్వాతే వారి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మీరు ఎవరినీ సంప్రదించకుండా వైఎస్ ఫొటోను ఎలా పెడతారు? గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల చిత్రపటాలు 3 అడుగులు మాత్రమే ఉండగా... వాటి పక్కన వైఎస్ చిత్రపటాన్ని 9 అడుగులతో ఎలా ఏర్పాటు చేశారు?'' అని ముద్దు కృష్ణమ నిలదీశారు. ఇదేమైనా గాంధీభవన్ అనుకున్నారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులైన ప్రకాశం పంతులు, బ్రహ్మానందరెడ్డి తదితరుల చిత్రపటాలున్నాయని స్పీకర్ తెలిపారు.

అయినప్పటికీ ముద్దు కృష్ణమ శాంతించలేదు. 'వైఎస్ చిత్రపటంపై ఈరోజు 11 గంటలకు బులెటిన్ జారీ చేశారు. ఆ బులెటిన్ శాసనసభ సొత్తు. మీరు ఎవరిని అడిగారు? సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఎవరిచ్చారు? మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం సరికాదు. ఇది గాంధీభవన్ కాదు..' అంటూ ఆగ్రహించారు. స్పీకర్ కూడా అంతే తీవ్ర స్వరంతో స్పందించారు.

"మీరు పరిధులు అతిక్ర మిస్తున్నారు. నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్‌ను ప్రశ్నించే అధికారం మీకు లేదు'' అని స్పష్టం చేశారు. ఈ దశలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పీఆర్పీ అధినేత చిరంజీవి కోరారు. ఇస్తానంటూనే స్పీకర్ టీవీ రామం కోసం సభను వాయిదా వేశారు.

జయంతి ప్రస్తావనపైనా అభ్యంతరం..
శాసనసభలో వైఎస్ జయంతి ప్రస్తావన తేవడంపైనా టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. "ఏడాది క్రితమే వైఎస్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ తీర్మానం చేశాం. ఆయనంటే మాకూ గౌరవముంది. గత సంప్రదాయాలకు భిన్నంగా మరణించిన ఒక వ్యక్తి జయంతిని పురస్కరించుకుని మాట్లాడటం సరికాదు'' అని టీడీపీ సీనియర్ నేత అశోక గజపతిరాజు అన్నారు.

దీనిపై స్పీకర్ స్పందిస్తూ... మనలో ఉన్న వ్యక్తి ఒక దుర్ఘటనలో మరణించినందునే గుర్తు చేసుకున్నామని... ప్రతి దానినీ వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. దీనిపై అశోక్ తిరిగి మాట్లాడుతూ... గతంలో ఏ నాయకుడి జయంతి రోజైనా మాట్లాడామా అని ప్రశ్నించారు. ఈ సమయంలో సీఎం జోక్యం చేసుకుని... "మంచిని మాట్లాడుకోవడం దుష్ట సాంప్రదాయం ఎలా అవుతుంది? మంచి మాట చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పవద్దు. దయచేసి సభా గౌరవాన్ని భంగపరచవద్దు'' అని కోరారు.

వైఎస్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ జానీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, పీఆర్పీ అధినేత చిరంజీవి, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, సీపీఎం పక్ష నేత జూలకంటి రంగారెడ్డి, సీపీఐ పక్ష నేత గుండా మల్లేశ్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అయితే... వైఎస్ ఫొటో పెట్టేముందు విపక్షాలను కూడా అడిగి ఉండాల్సిందని గుండా మల్లేశ్, జూలకంటి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు.

వైఎస్ చిత్రపటం ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేయడం శోచనీయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని గానీ, ఇంకెవరిదైనా గానీ పెట్టదలచుకున్నప్పుడు కమిటీలో మాట్లాడుకుంటే బాగుంటుందని సూచించారు. వైఎస్ చిత్రపటాన్ని కమిటీ హాల్లో పెట్టడానికి స్పీకర్ అంగీకరించినందుకు ఎమ్మెల్యే శంకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ చిత్రపటాన్నీ పెట్టాలని సూచించారు.